దేవరకొండ సెప్టెంబర్ 18 (నవ సంఘర్షణ): దేవరకొండ మండలం పడ్మట్పల్లి గ్రామానికి చెందిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ పల్లా నర్సింహారెడ్డి గారి కుమారుడు కీ.శే. పల్లా సుధీర్ రెడ్డి గారి దశదిన కార్యక్రమం ఈరోజు వారి స్వగృహంలో భక్తిశ్రద్ధలతో జరిగింది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గౌరవ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై నివాళులు అర్పించారు. ఆయనతో పాటు దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్యా దేవేందర్ నాయక్ గారు, పలువురు ప్రజాప్రతినిధులు, సీపీఐ నాయకులు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ పెద్దలు, యువజన నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్భంగా పల్లా సుధీర్ రెడ్డి గారి చిత్రపటానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్యా దేవేందర్ నాయక్ గారు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం పల్లా నర్సింహారెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సుధీర్ రెడ్డి గారి అకాల మరణం తమను తీవ్రంగా కలచివేసిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ కష్టకాలంలో పల్లా కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని సుధీర్ రెడ్డి గారి సేవలను గుర్తు చేసుకున్నారు.

