విద్యాసంస్థలపై నిరాధార ప్రచారాలు, బెదిరింపులు వెంటనే ఆపాలి – కత్తుల కాన్షీరామ్, లా స్టూడెంట్
నల్లగొండ న్యూస్ :మహాత్మా గాంధీ యూనివర్సిటీ అనుబంధ ఆరోరా లా కాలేజ్పై కొన్ని మీడియా వేదికల ద్వారా జరుగుతున్న నిరాధార ఆరోపణలు, ఏకపక్ష కథనాలు, బెదిరింపు ధోరణితో కూడిన ప్రసారాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
ప్రత్యేకంగా HMTV మరియు iNews ఛానళ్లలో ప్రసారమవుతున్న కొన్ని కథనాలు, వాస్తవాలను నిర్ధారించకుండా ఒక విద్యాసంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఉండటమే కాకుండా, కాలేజీ యాజమాన్యాన్ని మానసికంగా వేధించేలా, భయభ్రాంతులకు గురిచేసేలా కనిపిస్తున్నాయి.
కొంతమంది దళారులు, స్వప్రయోజనాల కోసం విద్యాసంస్థలపై ఒత్తిడి తీసుకురావడానికి మీడియాను ఆయుధంగా ఉపయోగిస్తూ, కాలేజీ యాజమాన్యంపై దూకుడుగా వ్యవహరించడం, కాలేజీ ప్రాంగణంలోకి వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి, విద్యా వ్యవస్థకు, మీడియా నైతిక విలువలకు విరుద్ధమైనవి.
ఏవైనా అక్రమాలు లేదా లోపాలు ఉన్నాయనే అనుమానాలు ఉంటే వాటిని చట్టబద్ధమైన అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. విచారణ పూర్తికాకముందే మీడియా విచారణ పేరుతో తీర్పులు ఇవ్వడం, నిరాధార ఆరోపణలతో ఒక విద్యాసంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయడం, యాజమాన్యంపై ఒత్తిడి తేవడం, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల్లో అనవసర భయాందోళనలు సృష్టించడం ఏమాత్రం సమంజసం కాదు.
విద్యాసంస్థలపై ఒత్తిడి, బ్లాక్‌మెయిల్ రాజకీయాలు, మీడియా విచారణ పేరుతో వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నాలు వెంటనే నిలిపివేయాలి. జర్నలిజం అంటే వాస్తవాలను వెలికితీయడం కానీ, ఎవరినైనా లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు, ఒత్తిళ్లు, ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రచారాలు చేయడం కాదు.
HMTV మరియు iNews ఛానళ్ల యాజమాన్యానికి స్పష్టమైన హెచ్చరిక చేస్తున్నాను. ఆధారాలు లేకుండా పరువు నష్టం కలిగించే ప్రసారాలు, ఒక విద్యాసంస్థను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం, బెదిరింపుల ధోరణి కొనసాగితే, బాధ్యులపై పరువు నష్టం, క్రిమినల్ బెదిరింపులు మరియు ఇతర వర్తించే చట్టాల ప్రకారం తగిన న్యాయపరమైన చర్యలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది.విద్యాసంస్థల గౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. మీడియా కూడా తన సామాజిక బాధ్యతను గుర్తించి, వాస్తవ నిర్ధారణతో, నిష్పాక్షికంగా వ్యవహరించాలని కోరుతున్నాను.